సకల జనుల సంక్షేమం కోసమే కొండగట్టు గిరి ప్రదక్షిణ: మేడిపల్లి సత్యం

సమృద్ధిగా వర్షాలు కురవాలి.. రైతులు సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్ష

కరీంనగర్, ఆంధ్రప్రభ: సకల జనుల సంక్షేమం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.

మంగళవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం కోరిన కోర్కెలు తీర్చే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

కొండగట్టు ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు పచ్చని ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని చెప్పారు.

ఈ కార్యక్రమం ఏ ఒక్క పార్టీకి, వర్గానికి లేదా మతానికి సంబంధించినది కాదని, సకల జనుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమమని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివస్తారని తెలిపారు.

కొండగట్టు ఆంజనేయస్వామి రూపం దేశంలోనే ప్రత్యేకమైనదని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని చెప్పారు. వేములవాడ, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

బుధవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నారాయణపూర్ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తి

నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని మేడిపల్లి సత్యం తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో కొందరు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

నారాయణపూర్‌ను దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించాలని అసెంబ్లీలో పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ముంపునకు గురయ్యే ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం ఎంపిక చేసిన 40 ఇళ్లకు పరిహారం చెల్లించలేదని, తమ ప్రభుత్వమే వారికి పరిహారం అందించిందన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి నిర్వాసితుల సమస్యలు, పరిహారం అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, చొప్పదండి సహకార పరపతి సంఘం చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గంగన్న, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.