గుడివాడ కొత్త బస్టాండ్‌కు ముహూర్తం!
- 4 నెలల్లో అందుబాటులోకి.. ఆగస్టు చివరికి స్లాబ్ పనులు పూర్తి
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ప్రజల చిరకాల కల అయిన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం అధికారులతో కలిసి సమీక్షించారు. గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఆర్టీసీ డి.ఈ జగదీష్ బస్టాండ్ నిర్మాణ పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు.
నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని, నిర్ణీత సమయానికల్లా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే రాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… గుడివాడ ప్రజల భావోద్వేగంతో కూడుకున్న ఆర్టీసీ బస్టాండ్ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుందన్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఆగస్టు నెలాఖరుకల్లా స్లాబ్ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రాము తెలిపారు. మరో నాలుగు నెలల్లోపు నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని స్పష్టం చేశారు.
బస్టాండు మాత్రమే కాకుండా గుడివాడ ఆర్టీసీ డిపో కార్యాలయ భవన నిర్మాణానికి దాత అన్నే నరసింహారావు దంపతులు 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారని, వారి దాతృత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దాతల నిధులతో పాటు ప్రభుత్వం కేటాయించే నిధులతో ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ బాగున నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
బైపాస్ రోడ్డు, ప్రధాన రహదారులు, శివారు కాలనీల రోడ్ల సమస్యలను ఇప్పటికే పరిష్కరించామన్నారు. త్వరలో మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే రాము,గుడివాడ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎస్ఆర్ ఎడిఫైస్ ప్రతినిధులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
