రాత్రి వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
- కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు
- ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ప్రాణ సంకటం
- మొక్కుబడిగా ప్రమాద సూచికలు
- 50 కిలోమీటర్ల ప్రయాణంలో ఉలిక్కిపాటు
గుంటూరు, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కనిపిస్తున్న భద్రతా లోపాలు పలువురు ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్నాయి. పగటి సమయంలో జరుగుతున్న పనులు కనిపిస్తున్నా, రాత్రులు ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. 50 కిలోమీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి పనుల్లో, భద్రత వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పనులు చేస్తున్న నిర్మాణ సంస్థ ప్రమాదాల నివారణకు, తీసుకోవాల్సిన చర్యలు మొక్కుబడిగా చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో రాత్రులు అటువైపు ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ప్రాణ సంఘటనగా మారింది.
రాత్రులు జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పనులు జరుగుతున్న చోట నిర్మాణ సంస్థ, మొక్కుబడిగా చేపట్టిన పనులు ప్రమాదాలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం గుంటూరు- పల్నాడు జిల్లాలను అనుసంధానం చేస్తూ 880 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి పై ప్రయాణం అభద్రతాభావం కలిగిస్తుంది. కొండమోడు నుంచి పేరేచర్ల వరకు ఈ పనులు జరుగుతున్నాయి.

రాత్రి సమయాల్లో భయం.. భయంగా ప్రయాణం..
పల్నాడు, గుంటూరు జిల్లాలను అనుసంధానం చేసే కీలక రహదారి పనులు కొండమోడు -పేరేచర్ల మధ్య జరుగుతున్నాయి. 50 కిలోమీటర్ల ఈ ప్రయాణంలోఅనుపాలెం, రాజుపాలెం, రెడ్డి గూడెంతో పాటుగా సత్తెనపల్లికి ఇరువైపులా, పేరేచర్ల సమీపంలో నాలుగు వరుసలు రహదారి పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ పలుచోట్ల రహదారిపై నిర్మాణ సామాగ్రిని వినియోగించింది. అవసరమైన చోట రహదారి ఎత్తును పెంచుతుంది. ఒకవైపు మాత్రమే రాకపోకలు వాహనాలు సాగిస్తున్నాయి. మరోవైపు రహదారి పక్కన డివైడర్లు ఏర్పాటు కోసం తవ్విన లోతట్టు ప్రాంతాలు, బ్రిడ్జిల నిర్మాణం జరిగే దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములే రక్షణ. ఇటువంటి చోట రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాల ప్రయాణం చాలా ప్రమాదకరంగా సాగుతుంది.
గత మూడు నెలల కాలంలో ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాలు మొత్తం రాత్రి సమయంలో జరిగినవే. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారే ముందు వెళ్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో అలాగే, తప్పుకునే సమయంలో ప్రమాదాలకు గురయ్యారు. కొత్తగా రహదారి ఏర్పాటు నేపథ్యంలో ఎగుడు, దిగుడుగా మారే రహదారుల వద్ద ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయి. 30కు పైగా ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకున్నట్లు అంచనా.
గుంటూరు నుంచి అద్దంకి- నార్కెట్ పల్లి హైవేకి ఈ రహదారి అనుసంధానంగా ఉంది. ప్రతిరోజు హైదరాబాదుకు రాకపోకలు సాగించేవారు ఈ రహదారి గుండా వెళ్లాల్సిందే. పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. వాణిజ్య పరంగా వాహనాలు తెలంగాణ వైపు నుంచి, పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంటాయి. రాత్రి సమయంలో వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై బారులు తీరి ప్రయాణం సాగిస్తుంటాయి. పనులు జరిగే చోట ప్రమాద సూచికలు కనిపించేలా ఉండకపోవడం ప్రమాద తీవ్రతను పెంచుతుంది.

పనులు చేస్తున్నారు… భద్రత మరిచారు
కొండమోడు -పేరేచర్ల నాలుగు వరసల జాతీయ రహదారి పనులు చేపట్టిన, నిర్మాణ సంస్థ పనులైతే వేగంగా చేయడం.. ఇంత వరకు సంతోషించదగిన విషయమే. అయితే ఇదే సమయంలో రాకపోకలు సాగించే ప్రయాణికుల విషయంలో భద్రత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యంత్రాలతో తవ్వకాలు, రోడ్లు ఏర్పాటు, పూడికలు వంటి పనులు, మరోవైపు బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. అవసరం అయిన చోట బైపాస్ పనులు కూడా చేపట్టారు. ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తున్నా ప్రయాణికులను భద్రతకు ప్రాధాన్యతను మరిచారు. నిర్మాణ సంస్థ మాత్రం మొక్కుబడి పనులతో కాలయాపన చేస్తుంది.
పనులు జరిగే చోట డ్రమ్ములు ఏర్పాటు చేసి వాటికి రేడియం స్టిక్కర్లు అంటించారు. ఇది కూడా రహదారి మట్టి కొట్టుకొని కనిపించకుండా మారాయి. మరోవైపు రహదారుల మధ్యలో ఏర్పాటు చేస్తున్న డివైడర్ కోసం తవ్వకాలు చేశారు. ఈ తవ్వకాలు వద్ద చిన్న చిన్న ఇసుక మూటలు అడ్డుగా పెట్టి చేతులు దులుపుకున్నారు. రాత్రులు రాకపోకలు సాగించే వారికి ఇవి కనిపించక ప్రమాదానికి గురవుతున్నారు. నిర్మాణ సంస్థ తమ పనులు చక్కబెట్టుకోవాలన్న తాపత్రయం మినహా, ప్రమాదాల నివారణకు ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదు. కొండమోడు నుంచి పేరేచర్ల వరకు పరిశీలిస్తే పనులు జరుగుతున్న చోట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలు నిర్లక్ష్యాన్ని చూపిస్తాయి. మరో ఏడాది పాటు పనులు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటికైనా నిర్మాణ సంస్థ లోపాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు అవసరం
ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో వాహనదారుల భద్రతకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిర్మాణ ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టివ్ సైనేజీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం డ్రమ్ములపై ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టిక్కర్లను పరిశీలించి, అవసరమైతే మరింత స్పష్టంగా కనిపించేలా మార్చాలి. అలాగే ఏ మార్గంలో వాహనాలు వెళ్లాలనే విషయాన్ని సూచించే దిశానిర్దేశక బోర్డులపై కూడా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి.
నిర్మాణ పనుల కారణంగా రహదారిపై దుమ్ము అధికంగా ఎగిసిపడుతుండటంతో, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము కారణంగా దృశ్యమానత తగ్గి ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. దీనిని నివారించేందుకు రోడ్లపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీటి చల్లడం (వాటర్ క్యూరింగ్) చేపట్టాలి. అదేవిధంగా ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, రాత్రి సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా చర్యలను రోడ్డు నిర్మాణ సంస్థ నిరంతరం పర్యవేక్షించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.
