మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..

మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు


ఏలూరు, జులై 28 (ఆంధ్రప్రభ): 2025 మెగా డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్) డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఏలూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామరెడ్డి నాని, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాటినవలస రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీఎన్‌ఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ… గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. క్రీడా కోటాలో నకిలీ క్రీడా ధ్రువీకరణ పత్రాలతో కొందరు ఉద్యోగాలు పొందిన అంశంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరిందని తెలిపారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తును దెబ్బతీసిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.