BRS | బెల్లంపల్లి రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ ధర్నా..

గుంతల రోడ్లు పూడ్చాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్

BRS | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గుంతలమయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కాంటా చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతృత్వంలో పార్టీ శ్రేణులు, నాయకులు కళ్లకు నల్లటి గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, పట్టణంలోని రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించడం లేదని విమర్శించారు.

రోడ్ల విస్తరణ పేరుతో అనేక కుటుంబాలు ఇళ్లు, దుకాణాలు కోల్పోయినా బాధితులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందించకుండా విస్మరించారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, రహదారుల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

పట్టణంలోని గురుకుల పాఠశాలల్లో పరిస్థితులు దయనీయంగా మారాయని, ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అన్నారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్‌వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు రేవెల్లి విజయ్, సబ్బని అరుణ్, మున్సిపల్ కౌన్సిలర్లు తాండ్ర స్రవంతి, బండారి స్రవంతి, బెడ్డల సౌజన్య, అసాది మధు, గోగార్ల స్వప్న, కొయ్యాడా ప్రసన్న, రజిత, రాజకుమార్, కాంపెల్లి రాజం, సిమ్రాన్ ఖలీమ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.