కారంపూడి మండల సమగ్రాభివృద్ధే ధ్యేయం

  • చిన్నగార్లపాడులో శ్రేణుల సంబరాలు
  • ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో జూలకంటి

కారంపూడి, ఆంధ్ర‌ప్ర‌భ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో కారంపూడి మండల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతి ఇంటికీ జూలకంటి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని చిన్నగార్లపాడు గ్రామం నుంచి మొదటి రోజు ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా పేటసన్నెగండ్ల అడ్డరోడ్డు వద్ద కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ర్యాలీగా బయలుదేరారు.

ఈ ర్యాలీ పెదకొదమగండ్ల, చినకొదమగండ్ల మీదిగా కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు, అభిమానుల భారీ వాహన శ్రేణితో చిన్నగార్లపాడు గ్రామానికి చేరింది. అనంతరం గ్రామంలో తల్లికి వందనం, ఉచిత బస్ ప్రయాణం ద్వారా లబ్ధిపొందిన మహిళలు ఎమ్మెల్యే జూలకంటికి హారతులు పట్టి, ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత గడపగడపకి తిరిగి గ్రామంలో అందించిన రూ. 9.09 కోట్ల సంక్షేమాన్ని, చేపట్టిన రూ. 56 లక్షల అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.2024 ఎన్నికల్లో ఆరాచకమా..? అభివృద్దా..? అంటే అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్నారు. మాచర్ల నియోజకవర్గాన్ని చంబల్ లోయగా మార్చి సాగిస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడి, ప్రజలు కూటమికి జై కొట్టారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రజాధారణ కోల్పోయిన జగన్.ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

లెవన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరి, ప్రజా రాజధానిపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ విధంగా విధ్వంసానికి గురవుతుందో ప్రజలు బాగానే గమనించారన్నారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని, రాజకీయాలు చేసిన రాక్షసుడికి సుపరిపాలన బాధ్యతలు గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి పంపిణీ కమిటీ చైర్మన్ పగులూరు అంజయ్య, ఎంపీపీ బొల్నెడి శ్రీనివాసరావు, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ మధుసూదన్ యాదవ్, దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, పంగులూరు పుల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ల సురేష్ యాదవ్, చప్పిడి రాము, బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.