జూరాలకు జలకళ… !
- 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
- రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి
జోగులాంబ గద్వాల్, ఆంధ్రప్రభ : ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ఆనకట్టల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహం తెలంగాణలోకి చేరడంతో కృష్ణా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 35,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 16,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులోని రెండు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 78 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
భీమా ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపు
భీమా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. చిన్నగోప్లాపూర్ భీమా స్టేజ్-1 నుంచి తొలుత 650 క్యూసెక్కుల నీటిని పంపించారు. అనంతరం ఆ నీరు భీమా స్టేజ్-2కు చేరుకోవడంతో మరో పంపును ప్రారంభించి 400 క్యూసెక్కుల నీటిని సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో సంగంబండ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సాగునీటి శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
ఉంద్యాల నుంచి పర్దిపురం రిజర్వాయర్‌కు నీరు
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల పంప్‌హౌస్ నుంచి పర్దిపురం రిజర్వాయర్‌కు 315 క్యూసెక్కుల నీటిని ఒక పంపు ద్వారా విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి జూరాలకు వస్తున్న వరద నీటిని వినియోగించుకుంటూ ఈ నీటిని రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. పర్దిపురం రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరిన తర్వాత అక్కడి నుంచి జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
వర్షాభావ పరిస్థితులతో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఊకచేటు వాగుకు కూడా నీటిని విడుదల చేయాలని, దీంతో వాగు పరివాహక ప్రాంతంలోని 18 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
