మహిళల జీవనోపాధి కార్యక్రమాలకు మరింత బలం

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ: మహిళా సంఘాల జీవనోపాధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, వారి ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ కల్పించడం ద్వారా ఆదాయాన్ని పెంచే దిశగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పీడీ డీఆర్‌డీఏ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, మత్స్యశాఖ అధికారి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, జిల్లా సమాచార శాఖ అధికారులు తదితరులతో సమావేశమై జీవనోపాధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

సమావేశంలో గుర్రపు డెక్కతో ఉత్పత్తులు తయారు చేస్తున్న మహిళా సంఘాలకు అందించాల్సిన రివాల్వింగ్ ఫండ్‌, మార్కెటింగ్ సౌకర్యాలపై కలెక్టర్ సమీక్షించారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు లభిస్తున్న ఆర్డర్లు, అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుకు అవసరమైన నిధులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అవసరానికి అనుగుణంగా రూ.5 లక్షల లోపు రివాల్వింగ్ ఫండ్ ప్రతిపాదనలు సమర్పించాలని, అనంతరం రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీడీ డీఆర్‌డీఏను ఆదేశించారు.

లేపాక్షి, ఇతర ఈ కామర్స్ ఆన్లైన్ వంటి సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ మహిళా సంఘాల ఉత్పత్తులకు మరిన్ని కొనుగోలు ఆర్డర్లు తీసుకురావాలని సూచించారు. అలాగే గోదావరి పుష్కరాలు, వేములవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, మోపిదేవి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి మార్కెట్ అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు.

గుర్రపు డెక్క ఉత్పత్తుల కేటలాగ్‌లో ఉత్పత్తుల ధరలను స్పష్టంగా పొందుపరచాలని, మార్కెటింగ్‌కు అనుకూలంగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మహిళలకు శిక్షణ మాత్రమే కాకుండా నిరంతర ఉత్పత్తి, విక్రయాలు జరిగే విధంగా మార్కెట్ అనుసంధానం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

విజయవాడలో మహిళల ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక షోరూమ్ ఏర్పాటు అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. తక్కువ వ్యయంతో ఆకర్షణీయంగా షాప్‌ను రూపొందించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అమృత కృష్ణ ప్లాంట్ మరమ్మతుల అంశంపై సమీక్షించిన కలెక్టర్, ఒకే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని స్పష్టం చేశారు. సాంకేతిక నిపుణుల సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకుని ప్లాంట్ నిరంతరాయంగా పనిచేసేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

గొర్రెల యూనిట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు త్వరితగతిన యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. కృష్ణా జిల్లాలో గొర్రెల పెంపకానికి మంచి అవకాశాలు ఉన్నందున రైతులు, మహిళా సంఘాలకు ఇది లాభదాయకమైన జీవనోపాధి కార్యక్రమంగా అభివృద్ధి చేయాలని చెప్పారు.

అలాగే గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) కార్యక్రమాల పురోగతి, ఇంపాక్ట్ స్టడీ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ఈ-మార్కెటింగ్, మహిళలకు సోషల్ మీడియా మార్కెటింగ్‌పై విజయవాడలో ప్రత్యేక శిక్షణ కల్పించే అంశాలపై కూడా సమీక్షించి, కార్యాచరణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో డిఆర్డిఎ పిడి హరిహరనాథ్, పశుసంవర్ధక శాఖ అధికారి ఎం శ్రీనివాసరావు, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజా, ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి జయరావు, ఏడిఐఓ సెల్వినా తదితర అధికారులు పాల్గొన్నారు.