ప్రత్యామ్నాయ పంటలతో నష్టాలను తగ్గించుకోవాలి
తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలి: వ్యవసాయ అధికారులు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు.
ఎల్కతుర్తి రైతువేదికలో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల పప్పుధాన్యాలు–కూరగాయల విత్తన మేళాలో మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు.
భూగర్భ జలాలు తగ్గే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
అలాగే పత్తి–కంది, కంది–మొక్కజొన్న వంటి అంతర పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆదాయంలో స్థిరత్వం సాధించవచ్చని వివరించారు.
విత్తన మేళాలో రైతులకు నాణ్యమైన పప్పుధాన్యాలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో పంటల వైవిధ్యీకరణ చేపడితే ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని అధిగమించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ ఏడీఏ డి. ఆదిరెడ్డి, ఎల్కతుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, ఎల్కతుర్తి గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజు, మండల వ్యవసాయ అధికారి ఎం. రాజ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బచ్చు బాబురావు, గొడిశాల రాజన్న గౌడ్, రైతు రక్షణ సమితి అధ్యక్షుడు హింగే భాస్కర్, ఎల్కతుర్తి ఉపసర్పంచ్ గొడిశాల రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. పున్నంచందర్, ఎ. రోజా, జె. బాబు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
