పట్నాపూర్‌లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానం

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని సీఐకి వినతి

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో మద్య నిషేధం విధిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు.

సోమవారం సర్పంచ్ కందారే లక్ష్మీ బాలాజీ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తుల సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధించాలని నిర్ణయిస్తూ తీర్మానం చేశారు.

అనంతరం తీర్మాన పత్రాన్ని జైనూర్ సీఐ రమేష్‌కు అందించారు. పట్నాపూర్‌లో మద్య నిషేధం అమలు చేస్తున్నందున గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మద్యం సేవించి పలువురు యువకులు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐకి వినతిపత్రం అందించినట్లు సర్పంచ్, గ్రామస్తులు తెలిపారు.

సీఐకి వినతిపత్రం అందించిన వారిలో సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.