మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ ఆందోళన విజయవంతం చేయాలి..

  • వైసిపి వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్

విజయవాడ, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ పిలుపునిచ్చారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరిగే ఈ ఆందోళనల్లో మెడికల్, డెంటల్, పారా మెడికల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత అభ్యర్థులకు సంఘీభావం తెలియజేయాలని ఆయన కోరారు.

డాక్టర్ మెహబూబ్ షేక్ మాట్లాడుతూ, మెగా డీఎస్సీ–2025 వ్యవహారం నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ తరహాలో జరిగిన భారీ కుంభకోణమని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించేలా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీల ద్వారా బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా ఈ నిరసన కార్యక్రమాలు హెచ్చరికగా నిలవాలని, అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రతి అభ్యర్థికి అండగా నిలిచేందుకు మెడికల్, డెంటల్, పారా మెడికల్ విద్యార్థులు భుజం భుజం కలిపి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలను విజయవంతం చేసి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రజలు, విద్యార్థులు తమ మద్దతు తెలియజేయాలని డాక్టర్ మెహబూబ్ షేక్ విజ్ఞప్తి చేశారు.