చికటాయపాలెంలో ఎమ్మెల్యేకు గ్రామస్తుల షాక్
కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు..
పాత పనులు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ నిలదీత
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని చికటాయపాలెం గ్రామంలో రూ.17 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అయితే ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తితో పాటు పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నప్పటికీ, గతంలో శంకుస్థాపనలు చేసిన పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
చికటాయపాలెం గ్రామం నుంచి ఆకేరు వాగు బ్రిడ్జి వరకు సుమారు కిలోమీటరు మేర బీటీ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై, శంకుస్థాపన కూడా జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు దుస్థితిని స్వయంగా పరిశీలించాలని ఎమ్మెల్యేను కోరినప్పటికీ ఆమె స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని గ్రామస్తులు ఆరోపించారు.
ఎమ్మెల్యే వెళ్లిన అనంతరం గ్రామ సర్పంచ్ చిదిరాల కృష్ణమూర్తితో పాటు రైతులు ఆకేరు వాగు బ్రిడ్జి వద్దకు వెళ్లి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే శంకుస్థాపన జరిగిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
