బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్

ఎక్స్‌టార్షన్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ ఎం. ప్రసాద్

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి, మరింత డబ్బు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ తెలిపారు.

అరెస్టు చేసిన నిందితుల సమక్షంలో సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడికి కొద్ది రోజులుగా నిందితులు ఫోన్ కాల్స్ చేస్తూ ఓ కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు.

ఈ నెల 26న హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి పదేళ్లు జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో ఇదే విధంగా రెండు సార్లు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ తెలిపారు.

వార్డెన్ ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో పాత ఉట్నూర్‌కు చెందిన నేతావత్ రాందాస్, నెట్వర్క్ జైల్ సింగ్‌లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 329(4), 308(6), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ ఎం. ప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.