పోలీసు శాఖలో ఏఐ శిక్షణకు కరీంనగర్‌లో శ్రీకారం

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ

కరీంనగర్ క్రైం ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కానిస్టేబుళ్లకు కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది.

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ సర్వైలెన్స్ వంటి సాంకేతికతలు నేర నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 2018, 2020, 2024 బ్యాచ్‌ల కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పీటీసీలో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట కమిషనరేట్లతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన సిబ్బందికి 11 దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రతి దశలో 80 మంది చొప్పున ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. శిక్షణలో ఏఐ ఆధారిత పోలీసింగ్, డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ, సైబర్ నేరాల గుర్తింపు, స్మార్ట్ సర్వైలెన్స్, డేటా విశ్లేషణ, నైతిక విలువలు, గోప్యతా నిబంధనలపై నిపుణులతో ప్రాయోగిక శిక్షణ అందించనున్నట్లు వివరించారు.

ఈ శిక్షణ ద్వారా పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించగలరని సీపీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీ ఎం. పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీలు విజయపాల్ రెడ్డి, బి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.