AP | పోలవరం వద్ద విషాదం..
జేసీబీని బయటకు తీసే క్రమంలో ఇద్దరు గల్లంతు..
ఒకరి మృతదేహం లభ్యం
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గోదావరి నదిలో వరద ప్రవాహం పెరగడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాం సమీపంలో నదిలో మునిగిపోయిన జేసీబీని బయటకు తీసే ప్రయత్నాల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.
అధికారుల వివరాల ప్రకారం.. గోదావరి వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిలో మునిగిపోయిన జేసీబీని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేపట్టారు. జేసీబీకి తాడు కట్టే సమయంలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
గల్లంతైన వారిలో ఒకరు ఇంజినీర్, మరొకరు మిషన్ ఆపరేటర్‌గా గుర్తించారు. అనంతరం గాలింపు చర్యల్లో ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిషన్ ఆపరేటర్ కోసం మత్స్యకారులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
