Department of Civil Supplies| నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో బియ్యం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, గ్రేడ్-1 పచ్చి బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయించనున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మార్కెట్ పరిస్థితులను సమీక్షించి, రైస్ మిల్లర్లతో చర్చలు జరిపిన అనంతరం ఈ ధరలను ఖరారు చేశారు.
పవన్ కళ్యాణ్ హర్షం..
రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ చేపట్టిన తక్కువ ధర బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన అనంతరం రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి అందుబాటు ధరలను నిర్ణయించినందుకు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆయన అభినందించారు.
ఈ చర్య వల్ల సాధారణ కుటుంబాలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే లభించే అవకాశం ఏర్పడుతుందని, ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ విక్రయాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
