బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
జిల్లాలో కోవిడ్-19 నివారణకు విస్తృత అవగాహన కార్యక్రమాలు
జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల (గ్రీవెన్స్) కార్యక్రమం అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, కోవిడ్-19 నివారణ చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్య తదితర శాఖలు పరస్పర సమాచార మార్పిడి, సమీక్షలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, ప్రత్యేక కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను పరిశీలించాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులకు అవసరమైన శిక్షణ, అనుభవాల పంచుకోవడం, సాంకేతిక అంశాలపై అవగాహన పెంపు అవసరమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, ముఖ్యంగా ఆర్థికేతర అంశాలను శాఖల స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూ సమస్యలకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కేసులకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లు, కౌంటర్ ఫైల్స్ దాఖలు చేశారా లేదా అనే అంశాన్ని వెంటనే పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న వాటిని ఆలస్యం చేయకుండా దాఖలు చేయాలని సూచించారు.

జిల్లాలో కోవిడ్-19 వ్యాప్తి నివారణకు విస్తృత స్థాయిలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్‌పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, రద్దీ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించేలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీవో శ్రీనివాసులు నాయుడు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణభూషణ్ రెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
