రౌడీషీటర్లకు రూరల్ పోలీసుల ప్రత్యేక కౌన్సిలింగ్..
నరసరావుపేట క్రైమ్, ఆంధ్రప్రభ : నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు నేర వృత్తిని పూర్తిగా వీడి బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజంలో జీవించాలని రూరల్ ఎస్‌ఐ కిషోర్ సూచించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని రౌడీషీటర్లను హెచ్చరించారు. గతాన్ని మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించి, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి, స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు.
తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, ఉన్నత విలువలు నేర్పించాలని, వారిని నేరప్రవృత్తులకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులుగా బాధ్యత వహించాలని ఎస్‌ఐ కిషోర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని రౌడీషీటర్లకు హితవు పలికారు.
