Breaking | టెంపో–ట్యాంకర్ ఢీ.. ముగ్గురు మృతి..

కుప్పం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి గ్రామ సమీపంలో కుప్పం పలమనేరు 42వ జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న టెంపో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రహదారి పక్కనే నిలిపి ఉన్న తాగునీటి ట్యాంకర్‌ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సుందరప్ప (57), ముని వెంకటమ్మ (50), ట్యాంకర్ సమీపంలో ఉన్న 4ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు శాంతిపురం మండలం బీరనకుప్పం గ్రామానికి చెందినవారు. సుందరప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఎదురుగా నివసించే వ్యక్తిగా స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన టెంపో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై రాళ్లబోదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదంతో కడపల్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకోగా, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి సహాయక చర్యలు చేపట్టారు.