కేకే కమిటీ నివేదిక విడుదలలో జాప్యం వద్దు: ఉద్యమకారుల ఫోరం

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోరం నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఇప్పటికే ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు సేకరించిందని గుర్తుచేశారు.

కమిటీ నివేదికను డిసెంబర్ వరకు వాయిదా వేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం లోపే మేనిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసి చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో పైడిపల్లి రమేష్, మేకల సంపత్, కత్తి సంపత్, పున్నం రవి, రవీందర్ రెడ్డి, భార్గవ్, సాంబమూర్తి, సురేందర్, బండారి రవి, సునీత రెడ్డి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.