పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…

పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…

ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలపై బారం మోపడమేనా…
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ సర్వీస్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపడాన్ని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. కనిష్టంగా ఉన్న 35 రూపాయల సర్వీస్ చార్జీలను ఒకేసారి 80 రూపాయలకు పెంచడం దారుణంగా ఉందన్నారు. ప్రజలకు కావలసిన అన్ని రకాల సర్టిఫికెట్లకు 50 శాతం కు పైగా సర్వీస్ చార్జి పెంచడమంటే ప్రజల నడ్డి విరవడమేనన్నారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారందరికి ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు, మొదలైన సంక్షేమ పథకాల మంజూరి కోసం దరఖాస్తులు చేసేటప్పుడు నివాసము, కులము, ఆదాయము వివిధ రకాల సర్టిఫికెట్లు అవసరమున్నాయన్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు మీసేవ సర్వీస్ చార్జీలు అడ్డగోలుగా పెరగడంతో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి బొక్కసాన్ని నింపుకోవడానికి మీ సేవ సర్వీస్ ఛార్జీలు పెంచడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు. ఇప్పటికే సామాన్య, మధ్య తరగతి ప్రజలు వంట గ్యాస్ ధరలతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అంతులేకుండా పెరిగి ఇబ్బందుల పాలౌతుంటే మీ సేవ చార్జీలు కూడా పెంచిన ప్రభుత్వ విధానంతో మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా తయారైందన్నారు. ప్రజలపై పెను బారాలను మోపడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలపై భారాలను మోపే విధానాలను ప్రభుత్వం విడనాడకుంటే ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని వెంకట్రాములు హెచ్చరించారు.

Leave a Reply