జానకంపేట లక్ష్మీనరసింహుని ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ
జానకంపేట క్షేత్రంలో మాధవానంద స్వామి ప్రత్యేక పూజలు
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. తొగుట సరస్వతి పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ మాధవానంద స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వేదమంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసిన స్వామికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి సత్కరించారు.
ముందుగా ఆలయ పవిత్ర పుష్కరిణిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మాధవానంద స్వామి, అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించిన అనంతరం క్షేత్రంలోని ఆధ్యాత్మిక ప్రశాంతతను కొనియాడుతూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం నూతనంగా చేపట్టిన గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణ పనులను స్వామి పరిశీలించారు. పనుల నాణ్యత, భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ఆరా తీసిన ఆయన, క్షేత్రాభివృద్ధికి ఉపయోగపడే పలు విలువైన సూచనలు, సలహాలు అందించారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజుపల్లి వేణు జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర, క్షేత్ర మహిమ, నిత్య పూజా విధానాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి స్వామికి వివరించారు. క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం, దాతలు, గ్రామస్థుల సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.
మాధవానంద స్వామి రాకతో ఆలయ ప్రాంగణంలో భక్తిపారవశ్యం నెలకొంది. స్వామి ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జానకంపేట గ్రామస్థులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేశారు.
