Technology | 19 ఏళ్ల కుర్రాడు.. 180 మంది బాధితులు..

Technology | 19 ఏళ్ల కుర్రాడు.. 180 మంది బాధితులు..

Technology | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టెక్నాలజీ మనిషిని ఎంత మేధావిని చేస్తోందో.. అంతకు మించిన ‘వికృత కామాంధులను‘ తయారు చేస్తోంది. కాదు కాదు…వారికి సహకరిస్తోంది కూడా..ఇందుకు ఉదాహరణె… మహారాష్ట్రలోని అమరావతిలో వెలుగు చూసిన ఉదంతం వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కేవలం 19 ఏళ్ల కుర్రాడు ఏకంగా 180 మంది బాలికలను బుట్టలో వేసుకుని, వారి ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టాడంటే.. మనం ఏ కాలంలో ఉన్నాం? మన ఆడబిడ్డల భద్రత ఎటు వెళ్తోంది? స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన జేబులో ఉన్నట్టు కాదు.. మన ప్రాణాలే ఇంకొకడి చేతిలో ఉన్నాయని గుర్తించాల్సిన సమయం ఇది.

Technology | మాయమాటలు.. ఆపై నగ్న వీడియోలు!

ఈ నేరగాళ్ల స్టైల్ అంతా ఒకేలా ఉంటోంది. ముందుగా సోషల్ మీడియాలో పరిచయం, ఆ తర్వాత తేనె పూసిన మాటలు తో ‘ప్రేమ‘ నటన. నమ్మకం కుదిరింది అని అమ్మాయిలు అనుకునే లోపే.. కాల్స్, వీడియో కాల్స్ పేరుతో ఏకాంత క్షణాలను రికార్డ్ చేయడం. ఒక్కసారి ఆ ‘ప్రైవేట్ వీడియో‘ గనుక వాడి చేతికి చిక్కితే.. అక్కడితో ప్రేమ కథ ముగిసి, బ్లాక్ మెయిల్ కథ మొదలవుతుంది. ఆ యువకుడి వద్ద 350 వీడియోలు దొరికాయంటే.. పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Technology | తప్పు ఎవరిది?

ఇక్కడఆలోచించాల్సిందేంటంటే.. అసలు ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తికి అంత చనువు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పీరియడ్స్ దగ్గర నుంచి పర్సనల్ విషయాల వరకు అపరిచితుడితో పంచుకుంటే.. అది అమాయకత్వమా లేక అజాగ్రత్తా?
మరోవైపు, అబ్బాయి తల్లిదండ్రుల వైపు నుంచి చూస్తే, 19 ఏళ్ల కొడుకు పడక గదిలో కూర్చుని వందలాది మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటుంటే.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుందా?.. వారు అందులో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే కనీస నిఘా లేకపోతే, కన్నకొడుకు నిర్వాకానికి సభ్యసమాజానికి ఏం సమాధానం చెపుతారు? రేపు ఆ తల్లిదండ్రులు కటకటాల ముందు నిలబడాల్సి వస్తే, ఆ పాపం ఎవరిది? స్వయంకృతం కాదా?

Technology | అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్!

స్మార్ట్ ఫోన్ లో కనిపించే అందమైన ప్రొఫైల్ వెనుక ఒక రాక్షసుడు ఉండొచ్చు. ‘అపరిచితుడు‘ ఎప్పటికీ అపరిచితుడే.

ఒక్కసారి మీరు పంపిన ఫోటో లేదా వీడియో మీ ఫోన్ దాటి బయటికి వెళ్తే.. దాని మీద మీకు నియంత్రణ ఉండదు. అది మీ ప్రాణం మీదకు తీసుకురావచ్చు.

వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వాడు దాన్ని రికార్డ్ చేస్తున్నాడనే స్పృహ ఉండాలి.

ఒకవేళ పొరపాటు జరిగి వీడియో బయటికి వెళ్తే.. భయపడి ఆత్మహత్యలకు పాల్పడకండి. నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి. వారు మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. రక్షణ బాధ్యత తీసుకుంటారు. మీలాగా మరికొందరికి అన్యాయం కాకుండా కాపాడుతారు.

టెక్నాలజీ పెరిగే కొద్దీ వికృత చేష్టలు పెరుగుతున్నాయి. అడల్ట్ సైట్లు చూసి కామాంధులుగా మారుతున్న యువతరం, కేవలం ఒక క్లిక్ తో ఇతరుల జీవితాలను నాశనం చేస్తోంది. కాలేజీలు, పాఠశాలలు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా.. వ్యక్తిగత అప్రమత్తత లేకపోతే మాత్రం ఫలితం శూన్యం. స్మార్ట్ ఫోన్ ను వాడుకోండి.. కానీ అది మిమ్మల్ని వాడేసుకుని, మీ బతుకును రోడ్డు పాలు చేసే వరకు వెళ్లకండి. తల్లిదండ్రులూ.. మీ పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

Leave a Reply