తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సుడిగాలి పర్యటన
రూ.4.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సోమవారం తొర్రూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి రూ.4.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పర్యటనలో భాగంగా గుడిబండ తండాలో సీసీ రోడ్డు, మహిళా భవనం, అంగన్వాడీ భవనం, నాంచారి మడూర్‌లో సీసీ రోడ్డు, గ్రామపంచాయతీ భవనం, మహిళా భవనం, వెలికట్టె గ్రామంలో బీటీ రోడ్డు, మహిళా భవనం, పెద్దమాంగ్య తండాలో సీసీ రోడ్లు, వెంకటాపురంలో సీసీ రోడ్డు, మహిళా భవనం, అమర్సింగ్ తండాలో సీసీ రోడ్డు, మహిళా భవనం, దుబ్బ తండాలో మహిళా భవనం, చీకటాయపాలెంలో సీసీ రోడ్లు, ఫతేపురంలో బీటీ రోడ్డు, పోలేపల్లిలో సీసీ రోడ్లు, ఎస్.వి.కే తండాలో సీసీ రోడ్లు, గుర్తూరులో సీసీ రోడ్లు, ఖానాపురంలో సీసీ రోడ్డు, మహిళా భవనం, హాచ్చు తండాలో సీసీ రోడ్లు, కొమానపల్లి తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించి శంకుస్థాపనలు చేశారు. ఇందులో మొత్తం 59 సీసీ రోడ్ల పనులకు రూ.196 లక్షలు, 21 మహిళా సంఘ భవనాల నిర్మాణానికి రూ.210 లక్షలు (ఒక్కో భవనానికి రూ.10 లక్షలు), 2 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.40 లక్షలు (ఒక్కో భవనానికి రూ.20 లక్షలు), 2 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.24 లక్షలు (ఒక్కో భవనానికి రూ.12 లక్షలు) మంజూరయ్యాయి. మొత్తంగా రూ.470 లక్షలు (రూ.4.70 కోట్లు) విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
