సర్.. గ్రామాల్లో నిశ్శబ్దం.. అవగాహన లేక అయోమయం!
సర్.. గ్రామాల్లో నిశ్శబ్దం.. అవగాహన లేక అయోమయం!
ప్రత్యేక ఓటర్ల సవరణలో గ్రామీణ ప్రాంతాల్లో స్పందన ఎందుకు తక్కువ?
బీఎల్వోలకు శిక్షణ, సాంకేతిక సమస్యలతో నత్తనడకన ప్రక్రియ
అవగాహన పెంపు, పారదర్శకతతోనే లక్ష్యం సాధ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు వెన్నెముక అయితే, ఓటరు జాబితా దానికి పునాది. ఆ పునాది పటిష్ఠంగా ఉండాలంటే ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు అర్థమయ్యేలా, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా జరగాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ 2026 ప్రక్రియను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. అవగాహన లోపం, అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యలు కలిసి ఈ ప్రక్రియను నత్తనడకన నడిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత నెల 25వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లక్ష్యం దొంగ ఓట్ల నిర్మూలన, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం. అయితే ఈ లక్ష్యం క్షేత్రస్థాయిలో సాకారం కావాలంటే ముందుగా బూత్ లెవల్ అధికారులకు సమగ్ర శిక్షణ, ప్రజలకు విస్తృత అవగాహన అవసరం. కానీ చాలా ప్రాంతాల్లో ఈ రెండు అంశాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించడం, గూగుల్ మీట్ల ద్వారా సమీక్షలు చేయడం జరుగుతున్నప్పటికీ ఆ ప్రభావం మండలాలు, గ్రామాల వరకు చేరడం లేదు. గ్రామాల్లో బూత్ లెవల్ అధికారులకు ఫారం-1, ఫారం-2, ఫారం-3 వినియోగం, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో ప్రజలు అడిగే సందేహాలకు సమాధానాలు చెప్పడంలో బీఎల్వోలు ఇబ్బందులు పడుతున్నారు.
మరో ప్రధాన సమస్య పాత ఓటరు జాబితాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం. గతంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో, ఏ పోలింగ్ కేంద్రంలో, ఏ క్రమ సంఖ్యలో ఓటు నమోదైందో తెలుసుకునే అవకాశం చాలా చోట్ల లేకపోవడంతో పేర్ల మార్పులు, బదిలీలు, కొత్త నమోదు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతోంది. పదేళ్లు, పదిహేనేళ్ల క్రితం వివాహం కారణంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లిన మహిళలు తమ పేర్లు ఓటరు జాబితాలో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతేకాక, సవరణ పత్రాల్లో ముద్రణా లోపాలు, సాంకేతిక సమస్యలు కూడా ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. బీఎల్వోలు ఎంతో శ్రమించి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత కూడా అనేక దరఖాస్తులు “ఎర్రర్“గా చూపుతున్నాయని సమాచారం. కొన్ని గ్రామాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ లోపాలు సకాలంలో పరిష్కారం కాకపోతే అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం ఏ పత్రాలు జత చేయాలి? ఏ ఆధారాలు అవసరం? వంటి ప్రాథమిక విషయాలపై కూడా స్పష్టమైన ప్రచారం జరగకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. గ్రామస్థాయిలో ప్రజలకు వివరించే అధికారులు లేకపోవడంతో అనేక మంది అయోమయంలో ఉన్నారు. మరోవైపు పనితీరు శాతంపై ఉన్న ఒత్తిడి కారణంగా కొంతమంది బీఎల్వోలు వాస్తవ పురోగతి కంటే ఎక్కువగా పని పూర్తయిందని నివేదిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే కేవలం సమీక్షా సమావేశాలు నిర్వహించడం సరిపోదు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలి. బీఎల్వోలకు ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అవసరమైన పత్రాలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి.
ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడి ఓటు విలువైనది. ప్రత్యేక ఓటర్ల సవరణ-2026 కేవలం పరిపాలనా కార్యక్రమంగా కాకుండా ప్రజల హక్కులను పరిరక్షించే బాధ్యతగా అధికారులు భావించినప్పుడే ఈ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇంకా సమయం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిపై దృష్టి సారించి, గ్రామీణ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తేనే సమగ్ర, పారదర్శక, నమ్మకమైన ఓటరు జాబితా సిద్ధమవుతుంది.
