అధిక ధరల ఆశ చూపి.. మిర్చి రైతులకు టోకరా..!

  • భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు నిందితుల అరెస్ట్..
  • కీలక పత్రాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : అధిక ధరలకు మిర్చి కొనుగోలు చేస్తామని నమ్మించి రైతులకు రూ.90 లక్షల మేర టోకరా వేసిన మోసగాళ్ల ముఠాలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వ్యాపార సంస్థలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జయశంకర్ జిల్లా చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. మల్లేశ్ వెల్లడించారు.

అధిక ధరల ఎరతో మోసం..

జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్న ఏ-4 నిందితుడు, ఏ-1 నుంచి ఏ-3 నిందితులతో కలిసి గ్రామంలోని మిర్చి రైతులను సంప్రదించారు. ప్రభుత్వ ధర కంటే భట్టికి రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లిస్తామని నమ్మించి రైతుల నుంచి సుమారు రూ.1.20 కోట్ల విలువైన మిర్చిని కొనుగోలు చేశారు. అయితే రైతులకు కేవలం రూ.30 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.90 లక్షలు ఎగ్గొట్టి పరారయ్యారు.

మోసపూరితంగా సేకరించిన మిర్చి బస్తాలను ఏ-5 సహకారంతో అతని ట్రేడర్స్ పేరుపై ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన నిందితులు, కొంత మిర్చిని విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత విలాసాలకు, వాహనాల కొనుగోలుకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.

తమపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితులు తమ పేర్లపై ఉన్న స్థిరాస్తులను ఏ-6 పేరిట బదిలీ చేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. సీసీఎస్ భూపాలపల్లి, మొగుళ్లపల్లి పోలీసుల సంయుక్త ప్రత్యేక ఆపరేషన్‌లో ఏ-1, ఏ-2 నిందితులను రంగాపూర్ గ్రామంలో ఏ-4 నిందితుడిని కలిసేందుకు వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ASK Agros, R-Enterprises సంస్థలకు సంబంధించిన కీలక పత్రాలు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన చిట్యాల సీఐ డి. మల్లేశ్, మొగుళ్లపల్లి ఎస్‌ఐ సురేష్, మొగుళ్లపల్లి పోలీసు సిబ్బంది, సీసీఎస్ సీఐ రమేష్, ఎస్‌ఐ నరేష్‌లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.