యోగాంధ్రకు ఘన గౌరవం..
- విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులకు ప్రశంసా పత్రాలు
- యోగంతో ఆరోగ్యం – భాగస్వామ్యంతో విజయం..
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర–2026 రాష్ట్ర కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా, యోగాంధ్రలో విశేషంగా పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. యువతకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నుంచి 15,300 మంది విద్యార్థులు, యువత, యోగా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాంధ్ర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఆయుష్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యోగా సంస్థలు, ఎన్‌జీఓల సమష్టి సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు.

యోగం శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాధారమని, ప్రతి ఒక్కరూ యోగాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. యోగాంధ్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్‌డీవో వెన్నెల శ్రీను, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. కొల్లేటి రమేష్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్నప్రియదర్శిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కోటేశ్వరరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, యోగా సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
