‘ బెల్టు’ తీయరేమి..!

  • ఉమ్మడి బాల్కొండ మండలంలో జోరుగా బెల్టు షాపుల దందా
  • వైన్స్‌లను మించి విక్రయాలు
  • తెల్లవారుజాము నుంచే బెల్టు షాపులు ఓపెన్
  • ‘మామూళ్ల ‘ మత్తులో అధికారులు..?

బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఉమ్మడి బాల్కొండ మండలంలో మద్యం విక్రయాలు బార్ లా తెరుచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమ్మడి  మండలంలో  6 లైసెన్స్డ్ వైన్ షాపులు మాత్రమే ఉన్నాయి. కానీ, వీటికి మించి ప్రతి గ్రామంలోనూ అనుమతి లేని ‘బెల్టు షాపులు’ పుట్టగొడుగుల్లా వెలిశాయి. లైసెన్స్డ్ దుకాణాల కంటే ఈ బెల్టు షాపుల్లోనే వ్యాపారం అత్యంత పెద్ద ఎత్తున సాగుతుండటం గమనార్హం.

నిబంధనల ప్రకారం వైన్ షాపులు నిర్ణీత సమయాల్లో మాత్రమే నడవాలి. కానీ గ్రామాల్లోని బెల్టు షాపులకు ఎలాంటి సమయపాలన లేదు. తెల్లవారుజామున 6 గంటలకే ఇక్కడ విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. అర్ధరాత్రి దాటినా కూడా మద్యం విక్రయిస్తూనే ఉన్నారు.కూలీలు, యువత ఉదయాన్నే ఈ దుకాణాల బాట పడుతున్నారు. కొన్ని చోట్ల కిరాణం షాపుల్లో కూడా మద్యం దొరకడం గమనార్హం.

నిలువునా మునుగుతున్న సామాన్య కుటుంబాలు

గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ మద్యం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బునంతా పురుషులు మద్యం రూపంలో బెల్టు షాపులకే తగలేస్తున్నారు. ఉదయం నుంచే మద్యం అందుబాటులో ఉండటంతో యువత,కూలి చేసుకునే వారు విచ్చల విడిగా మద్యం సేవిస్తూ  వ్యసనాల బారిన పడుతున్నారని పలు గ్రామాల్లోని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల్లో మామూళ్ల మత్తు ఉందా..?

అధికారుల వ్యవహారం నిమ్మకు నీరెత్తినట్లు  ఉండటంతో మామూళ్ల మత్తులో ఉన్నారా అని అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి.
గ్రామగ్రామానా ఇంత పెద్ద ఎత్తున అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ మరియు స్థానిక పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అధికారులకు నెలవారీగా భారీ ఎత్తున ‘మామూళ్లు’ అందుతుండటం వల్లే వారు కళ్లున్నా గ్రుడ్డివారిలా నటిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి బాల్కొండ మండలంలో అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులపై తక్షణమే దాడులు చేసి, వాటిని పూర్తిగా అరికట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.