బుడాపెస్ట్‌లో హన్సికా మెరుపు.. భారత్‌కు ఐదు పతకాలు

  • ర్యాంకింగ్ సిరీస్‌లో హన్సికా లాంబాకు రజతం
  • విశాల్, రజత్‌కు కాంస్యాలు..
  • భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు

ఆంధ్రప్రభ : హంగేరీలో జరుగుతున్న పోల్యాక్ ఇమ్రే–వార్గా యానోస్–కొజ్మా ఇస్త్వాన్ మెమోరియల్ సీనియర్ ర్యాంకింగ్ సిరీస్–2026లో భారత మహిళా రెజ్లర్ హన్సికా లాంబా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 55 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన హన్సికా, స్వర్ణ పతక పోరులో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన నటాలియా క్లివ్‌చుట్స్కాతో తలపడిన హన్సికా గట్టి పోరాటం చేసినప్పటికీ 0-5 తేడాతో పరాజయం పాలైంది. దీంతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

అంతకముందు, సెమీఫైనల్లో జర్మనీకి చెందిన అనస్తాసియా బ్లాయ్వాస్‌పై హన్సికా అసాధారణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 2-7తో వెనుకబడిన ఆమె, వరుస టేక్‌డౌన్‌లతో మ్యాచ్‌ను మలుపుతిప్పి 10-7తో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది జరిగిన సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన హన్సికా, ఇప్పుడు బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో రజతం సాధించి తన అంతర్జాతీయ ప్రస్థానంలో మరో ఘనతను నమోదు చేసింది.

భారత్ ఖాతాలో ఐదు పతకాలు

పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలోనూ భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. 65 కిలోల విభాగంలో విశాల్ కలిరామన్ కజకిస్థాన్‌కు చెందిన ఒస్సుమ్జాన్ దస్తాన్‌బెక్‌పై 8-2తో విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 125 కిలోల హెవీవెయిట్ విభాగంలో రజత్ రుహాల్‌కు అమెరికాకు చెందిన మేసన్ మార్క్ పారిస్ గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకోవడంతో విజేతగా ప్రకటించి కాంస్య పతకాన్ని అందించారు.

టోర్నీ రెండో రోజు ముగిసే సరికి భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించింది. తొలి రోజు 57 కిలోల విభాగంలో అమన్ సెహ్రావత్ స్వర్ణం, 61 కిలోల్లో దీపక్ కాంస్యం గెలవగా.. రెండో రోజు హన్సికా రజతంతో పాటు విశాల్, రజత్ కాంస్య పతకాలు జోడించారు.

భారత్ పతకాల జాబితా

పురుషుల ఫ్రీస్టైల్

  • 57 కిలోలు – అమన్ సెహ్రావత్ – స్వర్ణం
  • 61 కిలోలు – దీపక్ – కాంస్యం
  • 65 కిలోలు – విశాల్ కలిరామన్ – కాంస్యం
  • 125 కిలోలు – రజత్ రుహాల్ – కాంస్యం

మహిళల విభాగం

  • 55 కిలోలు – హన్సికా లాంబా – రజతం