కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు నోటీసులు..

  • ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం..
  • బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యల హెచ్చరిక

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఫెడరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్, ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఫెడరేషన్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని జానీ మాస్టర్‌కు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదని పేర్కొంది. దీంతో ఆయన వైఖరిపై ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఫెడరేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన ఫెడరేషన్, ఆయనపై సహాయ నిరాకరణ (నాన్-కోఆపరేషన్) చర్యలు చేపట్టినట్లు తెలిపింది. నిర్ణీత గడువులో వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

అదే సమయంలో డ్యాన్సర్ల అసోసియేషన్ వ్యవహార శైలిపైనా ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుమలత వ్యవహారంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్, సంస్థ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.

ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. జానీ మాస్టర్ స్పందనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.