గిరిపురంలో అతిసార కలకలం
- కలుషిత నీరే కారణమా?.. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స..
- క్షేత్రస్థాయిలో కలెక్టర్ లక్ష్మీశ పర్యటన
- వైద్య శిబిరం, ఇంటింటి సర్వే ప్రారంభం
- పారిశుద్ధ్యంపై విమర్శలు.. అప్రమత్తమైన వైద్య, నగరపాలక యంత్రాంగం
విజయవాడ,ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలోని గిరిపురంలో అతిసార కలకలం రేగింది. గత వారం రోజులుగా పలువురు వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురికాగా, కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు ఐసీయూలో చికిత్స పొందినట్లు స్థానికులు తెలిపారు. కలుషిత మంచినీటి సరఫరా, అధ్వాన్న పారిశుద్ధ్య పరిస్థితులే దీనికి కారణమని ఆరోపిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు విమర్శించారు. దళితులు అధికంగా నివసించే గిరిపురం సహా కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని, నీటి కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిపురంలో వెలుగులోకి..
విజయవాడలోని గిరిపురంలోని 88వ సచివాలయం పరిధిలో ఒకరికి స్వల్ప విరోచనాల సమాచారం అందిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఐదు వైద్య బృందాలతో ఇంటింటి సర్వే ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ, మరగబెట్టిన నీటినే తాగాలని, వేడి ఆహారమే తీసుకోవాలని, నిల్వ ఆహారం, హోటల్ భోజనం నివారించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎ. శ్రావణ్ బాబు పరిస్థితిని పరిశీలించి వైద్య సేవలను పర్యవేక్షించారు. మలేరియా, నగరపాలక సంస్థ సిబ్బంది పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. శుక్రవారం నలుగురు స్వల్ప విరోచనాలతో వైద్య కేంద్రానికి రాగా చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అనుమానిత కేసులు పూర్తిగా తగ్గే వరకు ప్రత్యేక వైద్య శిబిరం, ఇంటింటి సర్వే కొనసాగుతుందని వైద్యశాఖ వెల్లడించింది.

