భక్తులకు శుభవార్త… సమగ్రాభివృద్ధి దిశగా ఇంద్రకీలాద్రి
- భక్తుల రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్
- శ్రావణ మాసంలోగా నూతన అన్నప్రసాద భవనం, లడ్డూ పోటు ప్రారంభం
- మల్టీలెవల్ పార్కింగ్, రెండో ఘాట్‌రోడ్ పనుల అడ్డంకుల తొలగింపు
- భక్తుల సంతృప్తే లక్ష్యంగా శాశ్వత మౌలిక వసతుల కల్పన
- ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధులు
- గొల్లపూడిలో ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల కీలక సమావేశం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధిపై గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ జి. రామకృష్ణ, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణంలో ఉన్న నూతన అన్నప్రసాద భవనం, ప్రసాద తయారీ కేంద్రం (లడ్డూ పోటు) పనులను గడువులోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. కొండపైకి వచ్చే వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రతిపాదించిన మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం, భక్తుల భద్రతకు కీలకమైన రెండో ఘాట్‌రోడ్ నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై మాస్టర్ ప్లాన్ రూపకర్తలతో అధికారులు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పనులకు అడ్డుగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
భక్తుల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా మాస్టర్ ప్లాన్..
ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దర్శన వ్యవస్థ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, అన్నప్రసాదం, ప్రసాదాల పంపిణీ, భక్తుల రాకపోకలకు సంబంధించిన అన్ని అంశాల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించి ‘భక్తుల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, మాస్టర్ ప్లాన్ సాంకేతిక నిపుణులు, దేవాదాయ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

