అడ్వకేట్‌పై దాడికి నిరసనగా…

మక్తల్ న్యాయవాదుల విధుల బహిష్కరణ

మక్తల్, (ఆంధ్రప్రభ): న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ మక్తల్ న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకొడ్ గ్రామానికి చెందిన అడ్వకేట్ నీరజ్‌పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మక్తల్ జూనియర్ సివిల్ జడ్జికి వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కోర్టు విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. అనంతరం కోర్టు ప్రాంగణం వెలుపల నినాదాలు చేస్తూ, అడ్వకేట్ నీరజ్‌కు న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. న్యాయవాదిపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రేయ, ఆడెం శ్రీనివాసులు, కె. సూర్య ప్రకాష్, రంకుల ఆనంద్, రవి కుమార్ గౌడ్, శివ కుమార్, సురేందర్, పొర్ల ఆనంద్, బండారి శ్రీనివాస్, దినేష్ వర్మ, భరత్ కుమార్, వెంకటేష్ గౌడ్, సునీత, సతీశ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.