ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో లోపాలు సరిదిద్దాలి
డీఈఓ ఎం. వెంకటేశ్వరరావుకు యూటీఎఫ్ వినతి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లా విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా, కేడర్ వారీగా విడుదల చేసిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఉమ్మడి జిల్లా నాయకత్వం గురువారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎం. వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, సీనియారిటీ జాబితాలో అనేక తప్పులు చోటుచేసుకున్నాయని, ఉపాధ్యాయులు పలుమార్లు అభ్యర్థనలు, అప్పీలు సమర్పించినప్పటికీ అదే తప్పులు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమోషన్ పొందిన అనంతరం అనివార్య కారణాలతో పదోన్నతిని నిరాకరించి తిరిగి రివర్షన్కు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీని రివర్షన్ తేదీ నుంచి కాకుండా వారి పూర్తి సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలని కోరారు.
అంతర్జిల్లా బదిలీల విషయంలో కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, అంతర్జిల్లా బదిలీల కింద రాని ఉపాధ్యాయులను ఆ జాబితాలో చూపడం, బదిలీల ద్వారా వచ్చిన కొందరి పేర్లు లేకపోవడం వంటి లోపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్లో తొలి సీనియారిటీ జాబితా విడుదలైనప్పటి నుంచి ఎన్నిసార్లు అభ్యర్థనలు సమర్పించినా ఇప్పటికీ వాటిని సవరించకపోవడం విచారకరమన్నారు.
వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో కూడా నిబంధనలను సమానంగా అమలు చేయాలని యూటీఎఫ్ కోరింది. పాఠశాలల్లో అదనపు పోస్టులను ఏ నిబంధనల ప్రకారం గుర్తించారో, అదే నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టుల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టాలని సూచించింది. సాంకేతిక కారణాలతో జూన్ 30 నాటికి సరైన రోల్ నమోదుకాని పాఠశాలల్లో అదనపు పోస్టులు చూపడం, అదే సమయంలో అవసరమైన పోస్టుల కేటాయింపులో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
కొన్ని మండలాల్లో అదనపు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవసరమైన పోస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ ఉపాధ్యాయులను మాత్రమే తప్పనిసరిగా బదిలీ చేయడం, జూనియర్ ఉపాధ్యాయులు మిగులు జాబితాలో కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి సీనియారిటీ జాబితాను సవరించాలని డీఈఓను కోరారు.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎస్. నాయుడు, జీవీ రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వయ్యాల మధు, జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, ప్రధాన కార్యదర్శి మణిగండన్, జిల్లా గౌరవాధ్యక్షుడు సదాశివరెడ్డి, సహాధ్యక్షుడు ఏకాంబరం, జిల్లా కార్యదర్శి పార్థసారథి, సీనియర్ నాయకుడు కత్తి శేఖర్, నాయకులు ప్రహ్లాద్, సుధాకర్, మునిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
