LiquorTransportScam | ఈడీ కస్టడీలో కీలక నిందితులు
LiquorTransportScam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కీలక నిందితులను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
గురువారం రాజ్‌కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్‌లను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత మధ్య బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.
కస్టడీ విచారణలో భాగంగా లిక్కర్ రవాణా వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అక్రమ నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్), నిధుల ప్రవాహం, ఇతర అనుబంధ అంశాలపై ఈడీ అధికారులు ముగ్గురు నిందితులను ప్రశ్నించనున్నారు.
ఈ కేసులో మద్యం రవాణా ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల పాత్ర, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించడంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ కస్టడీ విచారణలో లభించే సమాచారం ఆధారంగా కేసులో మరికొంత మందిని విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పురోగతికి అనుగుణంగా ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
