చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది: వేముల వీరేశం
చిట్యాల (ఆంధ్రప్రభ): చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల చేనేత సహకార సంఘం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్షుడు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలను పాలకవర్గం బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందేలా కృషి చేయాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. అలాగే చిట్యాల చేనేత సహకార సంఘానికి నూతన భవన నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, చేనేత సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
