Minister Nadendla Manohar | 18లోగా కమిటీలు పూర్తి చేయాలి..
Minister Nadendla Manohar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఇవాళ నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కూటమిలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నది ముఖ్యమైన విషయం కాదని, ఎక్కడ గెలిచే అవకాశం ఉందో అక్కడే పోటీ చేయడం లక్ష్యంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే గెలిచే స్థానాల్లోనే బరిలో నిలవడం జనసేన వ్యూహమని స్పష్టం చేశారు.
కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నెల 18వ తేదీలోగా సమన్వయ కమిటీల నియామక ప్రక్రియ పూర్తిచేయాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి పరస్పర సహకారం, సమన్వయం కీలకమని ఆయన పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహాలను రూపొందిస్తున్నామని, అందుకు అనుగుణంగానే సీట్ల పంపకం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
