వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం

చిట్యాల (ఆంధ్రప్రభ): వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెలరోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో గురువారం మహిళలు సంప్రదాయబద్ధంగా కప్ప కాముడు నిర్వహించి, సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు బిందెలతో ఆలయానికి చేరుకుని సామూహికంగా జలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందన్నారు. భగవంతుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆనకంటి నరేష్, ఏర్పుల వెంకన్న, కురు యాదయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.