బీఆర్ఎస్ హయాంలోనే మామునూరు ఎయిర్‌పోర్టుకు అనుమతులు

ఉమ్మడి వరంగల్ (ఆంధ్రప్రభ): మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు.

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. నిజాం కాలంలో నిర్మితమైన మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారని తెలిపారు. ఉడాన్ పథకం కింద కూడా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించామని, 1.8 కిలోమీటర్ల రన్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కిలోమీటర్లకు విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ, మామునూరు ఎయిర్‌పోర్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించామని, ఎన్నికల కోడ్ కారణంగా నియామకాలు నిలిచిపోయాయని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం కూడా రూ.500 కోట్లతో భూసేకరణ చేపట్టామని పేర్కొంటూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు.

మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, భూసేకరణకు అనుమతి ఇచ్చింది ఎవరో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. దేశంలో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ మామునూరు ఎయిర్‌పోర్టును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని, మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వమే పునాది వేసిందని పేర్కొన్నారు.