ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నన్నపునేని నరేందర్
వరంగల్ (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాలను పరిశీలించి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా 18వ డివిజన్ పరిధిలోని 139, 140, 141 బూత్‌లను సందర్శించిన నన్నపునేని నరేందర్, సంబంధిత బీఎల్వోలు, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలతో కలిసి బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సమర్పించిన ఫారం-1ల సంఖ్య, మరణించిన ఓటర్ల వివరాలు, డబుల్ ఓట్ల సంఖ్య, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారి సంఖ్య, ఇంకా ఫారం-1 సమర్పించని వారి వివరాలు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, 2002లో ఓటు హక్కు లేని వారి వివరాలు, నూతన ఓటర్ల నమోదు వంటి అంశాలపై ఆరా తీశారు.
ప్రతి బూత్‌కు సంబంధించిన సమాచారాన్ని బీఎల్వోలు, బీఎల్ఏల ద్వారా తెలుసుకుని సమీక్షించిన ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బీఎల్వోలు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
