అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి వార్డులో బుధవారం నిర్వహించిన భూలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న దంపతులు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు వార్డు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
పుల్లూరి రామయ్యపల్లి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో పెద్దమ్మతల్లి ఆలయం, లక్ష్మీదేవర ఆలయం, అంతర్గత రహదారులు సహా పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

