ఇంటి నుంచి వెళ్లిన బాలిక.. క్షేమంగా అప్పగింత..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కుటుంబంలో జరిగిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయి చిత్తూరుకు చేరుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలికను చిత్తూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు సురక్షితంగా గుర్తించి, ఆమె తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

కర్ణాటక రాష్ట్రంలోని బంగారపేట ప్రాంతానికి చెందిన బాలిక బుధవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. విధుల్లో ఉన్న సెంట్రీ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కరీమున్నీసాకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించి బాలికకు రక్షణ కల్పించారు. అనంతరం ఆమెను వన్ స్టాప్ సెంటర్‌లో సురక్షితంగా ఉంచి, తల్లిదండ్రులకు సమాచారం అందించి చిత్తూరుకు రప్పించారు.

గురువారం రాత్రి మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు ఆమెను క్షేమంగా అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా గుర్తించి అప్పగించినందుకు చిత్తూరు జిల్లా పోలీసులకు, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందికి, జిల్లా ఎస్పీ తుషార్ డూడికి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్నారులతో సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోవడం కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.