వేములవాడ కళ్యాణకట్టలో ఈవో ఆకస్మిక తనిఖీలు..
అదనపు వసూళ్లపై కఠిన హెచ్చరిక
వేములవాడ (ఆంధ్రప్రభ): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకట్టలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కళ్యాణకట్టలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకుని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
అనంతరం విధుల్లో ఉన్న నాయి బ్రాహ్మణులను వీడియో రికార్డింగ్ ద్వారా ఇంటర్వ్యూ చేసి వారి వివరాలు సేకరించారు. వారికి వేతనాలు సక్రమంగా అందుతున్నాయా, కాంట్రాక్టర్ ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. కళ్యాణకట్ట నిర్వహణ కాంట్రాక్టర్‌కు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా యూనిఫాం, గుర్తింపు కార్డులు అందజేయాలని, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.
భక్తుల నుంచి తలనీలాల కోసం అదనపు డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈవో స్పష్టం చేశారు. అలాంటి ఘటనలు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే కాంట్రాక్టును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు తలనీలాల టికెట్ ధర రూ.50 మాత్రమే, అదనపు డబ్బులు చెల్లించవద్దని, అదనపు వసూళ్లు శిక్షార్హమైన నేరమని తెలిపే బోర్డులను ఏర్పాటు చేయించారు. మైక్ ద్వారా నిరంతరం ప్రకటనలు చేయాలని కూడా ఆదేశించారు.
కళ్యాణకట్టలోని రెండు విభాగాలను పరిశీలించిన ఈవో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. నగదు వసూళ్లపై నిఘా కోసం ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించాలని, మొత్తం ప్రాంగణం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం నిర్వహణకు సంబంధించిన అధికారులతో సమావేశమైన ఈవో, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, దేవస్థానం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి పారదర్శకమైన, ఇబ్బందుల్లేని సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని పేర్కొంటూ, ఎవరైనా అదనపు డబ్బులు వసూలు చేస్తే వెంటనే దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరారు. ఈ తనిఖీల్లో దేవస్థానం డీఈవో నవీన్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, శివసాయి, ఏఈ రామకృష్ణారావు, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
