గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం
- గురువారం నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు
- జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ అధికారులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: చారిత్రక గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయ ప్రతినిధులు ఆహ్వానించారు. గురువారం నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయ కార్యనిర్వహణ అధికారి, పూజారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోల్కొండ బోనాల ఉత్సవాల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేసి, ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు గోల్కొండ బోనాలతో శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
