ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం…
- ముగ్గురు నిందితులు ఈడీ కస్టడీకి
- మూడు రోజుల విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి
ఆంధ్రప్రభ : ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌ను మూడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపు ఆరోపణలతో పాటు ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలకు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, నిధుల ప్రవాహం, ఇతర భాగస్వాముల పాత్రపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను విచారించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈడీ కస్టడీ విచారణ నేపథ్యంలో ఏపీ లిక్కర్ కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
