క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం

  • అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి
  • చైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యారాణి

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సంధ్యారాణి సూచించారు. మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మురళీకృష్ణ బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గత విషయాలను పక్కనపెట్టి ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు, సిబ్బందిని కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని కమిషనర్‌కు స్పష్టం చేశారు.

రాజకీయ జోక్యానికి తావులేకుండా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

నూతన కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. చైర్‌పర్సన్ సూచనల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపాలిటీ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులను చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.