ఆషాఢ సారెతో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్ది..

మొదటి రోజే మహిళలతో కళకళలాడిన కనకదుర్గమ్మ సన్నిధి..
ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా సారె భక్తుల రాక
సాయంత్రం 4 గంటల వరకు 23 సారె బృందాలు..
9,623 మంది భక్తుల రాక..
సారె భక్తులందరికీ రూ.100 దర్శన మార్గంలో ఉచిత దర్శనం..
ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగ పంపిణీ..
ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం, తాగునీరు..
ప్రత్యేక క్యూ లైన్లు, రిజిస్ట్రేషన్‌తో విస్తృత ఏర్పాట్లు…
సీసీ కెమెరాలు, వైర్‌లెస్ వ్యవస్థతో రద్దీ నియంత్రణ..
మొబైల్ ఫోన్లతో ఆలయ ప్రవేశంపై కఠిన నిబంధనలు..
భక్తితో, క్రమశిక్షణతో అమ్మవారి దర్శనం…
అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో వి.కె. శీనా నాయక్..

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస సారె ఉత్సవాల తొలి రోజున మహిళా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె సంభారాలతో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు 23 సారె బృందాలకు చెందిన 9,623 మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు.

ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా…

ఉదయం 6.30 గంటలకు ప్రధాన ఆలయం నుంచి శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవమూర్తిని అర్చక బృందం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచారణల మధ్య మహామండపం ఆరో అంతస్తుకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదికపై ప్రతిష్ఠించింది. అనంతరం భక్తులు క్రమపద్ధతిలో సారె సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

సారి తెచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం…

సారె భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రూ.100 ప్రత్యేక దర్శనానికి కేటాయించే భవానీ అనుగ్రహ దర్శన్ క్యూ లైన్‌ను పూర్తిగా సారె భక్తుల ఉచిత దర్శనం కోసం కేటాయించారు. ఆషాఢ మాసం మొత్తం సారె తీసుకువచ్చే భక్తులందరికీ ఇదే విధంగా ఉచిత దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.

2017 లో ప్రారంభం..

ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమాన్ని 2017లో అప్పటి దేవస్థానం ఈవో, ఐఏఎస్ అధికారి ఎ. సూర్యకుమారి ప్రారంభించగా, అప్పటి నుంచి ప్రతి ఏడాది సారె భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం భవానీ దీక్షల తరహాలో వేలాదిమంది మహిళలు, కుటుంబ సభ్యులు సారె సమర్పణకు వస్తుండడం విశేషంగా మారింది. ఇదే సమయంలో తెలంగాణలో బోనాల ఉత్సవాలు కొనసాగుతుండటంతో అక్కడి నుంచి విజయవాడకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం, విశ్రాంతి ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలను విస్తృతంగా చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు…

మొదటిసారిగా ఆషాఢ సారె సమర్పించే భక్తబృందాల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ విధానాన్ని దేవస్థానం అమలు చేస్తోంది. శ్రీ కనకదుర్గ నగర్ నుంచి కొండపైకి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయంలో మొబైల్ ఫోన్లతో ప్రవేశాన్ని నిషేధించగా, నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, వైర్‌లెస్ వ్యవస్థ ద్వారా ప్రతి ప్రాంతంలోని రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు జారీ చేస్తూ సమర్థవంతంగా భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు. దేవస్థానం కల్పిస్తున్న ఉచిత దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదం, అన్నప్రసాదం వంటి సదుపాయాలను వినియోగించుకుని భక్తితో, క్రమశిక్షణతో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతోందని, ఇతర భక్తుల ఏకాగ్రత దెబ్బతింటోందని పేర్కొంటూ, ఫోన్లు తీసుకురాకుండా సహకరించాలని కోరారు.