Food Safety | ప్రజారోగ్యంపై రాజీ లేదు..
ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల బలోపేతం : మంత్రి దామోదర
కల్తీ ఆహారం, నకిలీ మందులపై ఉక్కుపాదం..
తనిఖీలు, ల్యాబ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మంత్రి ఆదేశాలు
Food Safety | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంటూ.. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల పనితీరు, ఎదురవుతున్న సవాళ్లు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు.
తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్లో సమన్వయం
ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న ఈ రెండు విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని అధికారులు వివరించారు. తనిఖీలు, ఆహార నమూనాల సేకరణ, ల్యాబ్ పరీక్షలు, చట్టపరమైన చర్యలను వేగవంతం చేయడం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. కల్తీ ఆహారం, నాసిరకం మందులు, నకిలీ ఔషధాల తయారీ, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.
ల్యాబ్ సామర్థ్యం పెంపుపై దృష్టి
రాష్ట్రంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఆధునీకరించాలని, అవసరమైన ప్రాంతాల్లో రీజినల్ ల్యాబ్ల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నమూనాల పరీక్షలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
నిపుణుల నియామకానికి ప్రాధాన్యం
ప్రజల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచేందుకు, నిపుణుల నియామకానికి కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నాణ్యమైన ఆహార పరిశ్రమకు ప్రోత్సాహం
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ ఫార్మా గుర్తింపును పెంచాలి
ఫార్మా, వ్యాక్సిన్ తయారీ రంగంలో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రతిష్టను మరింత పెంచేలా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (GMP) అమలును ప్రోత్సహించాలని డ్రగ్ కంట్రోల్ విభాగానికి సూచించారు. ప్రజలకు సురక్షితమైన మందులు, నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో అవసరమైన సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
