బీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనమే బీజేపీ నాయకులపై అక్రమ కేసులు

ప్రశ్నించే గొంతులను కేసులతో భయపెట్టలేరు
Brs బాట లోనే కాంగ్రెస్ పయనిస్తున్నది
కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై పోరాడిన బీజేపీ నాయకులను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించారని, అలాంటి తప్పుడు కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా ఈరోజు ఖమ్మం కోర్టుకు హాజరైనట్లు బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, “ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణిచివేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ బీజేపీ నాయకులు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. బెదిరింపులకు, కక్ష సాధింపు రాజకీయాలకు భయపడకుండా ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర బీజేపీది” అని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ధైర్యంగా అడ్డుకున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతును అణిచివేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తూ బీఆర్ఎస్ అనుసరించిన అదే నిరంకుశ విధానంలో నడుస్తోందని విమర్శించారు. అధికారాలు శాశ్వతం కావని, ప్రజలను మోసం చేస్తూ ప్రతిపక్షాలను వేధించే ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కోర్టు విచారణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ రాథోడ్, బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమిలి శ్రీనివాస్, దీకొండ శ్యాం హాజరయ్యారు. బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు వెంకట గుప్తా, తుమ్మ శివ సమక్షంలో కోర్టు విచారణకు హాజరై తదుపరి న్యాయపరమైన ప్రక్రియలో పాల్గొన్నారు.