వైభవోపేతంగా ప్రారంభమైన ఆషాఢ ఉత్సవాలు
కనకదుర్గమ్మకు ఆషాఢసారె సమర్పణ..
మేళతాళాలు, కోలాటాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ
శోభాయమానంగా అమ్మవారికి తొలి సారె ఊరేగింపు…
ఘనంగా స్వాగతించిన దేవస్థానం అధికారులు, ఈఓ
ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఇంద్రకీలాద్రి…
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పరమపవిత్రమైన ఆషాఢ మాస సారె ఉత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవంలో భాగంగా దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల గోవింద నామస్మరణలు, వేదమంత్రోచారణలు, మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

విశిష్టత ఉన్న ఆషాడసారె…
సనాతన ధర్మంలో ఆషాఢ మాస సారె సమర్పణకు విశిష్ట స్థానం ఉంది. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, ఇతర సారె సంభారాలను సమర్పించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. ఈ సారె సమర్పణతో లోకకల్యాణం, కుటుంబ సౌభాగ్యం, సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సంప్రదాయంలో భాగంగా ప్రతి ఏడాది దేవస్థానం వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారెతో ఆషాఢ ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

తొలిసారె సమర్పించిన వైదిక కమిటీ..
ఇంద్రకీలాద్రిపై బుధవారం ఉదయం ఘాట్ రోడ్డులోని ‘ఓం మలుపు’ నుంచి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారె సంభారాలను నెత్తిన పెట్టుకుని మేళతాళాలు, కోలాటాలు, వేద పండితుల మంత్రోచారణల నడుమ శోభాయమానంగా ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయ చిన్న రాజగోపురం వద్దకు వచ్చిన వైదిక బృందానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో లోపలికి తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్ దర్శనం చేసుకున్న వైదిక సిబ్బంది మహామండపం ఆరో అంతస్తులో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తి సమక్షంలో సారె సంభారాలను సమర్పించారు. అర్చక బృందం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేసింది. సారె సమర్పించిన వైదిక సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను ఆలయ మర్యాదలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్యులు వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి. శంకర శాండిల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సంప్రదాయ పాఠశాల విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆషాఢ సారె ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు.
